- మోంథా తుపాను సమయంలో అద్భుత సేవలు అందించారని ప్రశంస
విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కొండలరావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మోంథా తుపాను సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత సేవలు అందించిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 175 మంది అధికారులు, సిబ్బందిని ‘సైక్లోన్ మోంథా ఫైటర్స్’ పేరిట సీఎం సన్మానించారు. ప్రశంసా పత్రాలను ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తుపాను సమయంలో ముందస్తు చర్యల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా తగ్గించగలిగామని తెలిపారు. మోంథా తుపాను తీవ్రత పెరిగిన సమయంలో విజయవాడ కొత్తపేట, ప్రైజర్ పేట, టేనర్ పేట, లంబాడీ పేట తదితర కొండ ప్రాంతాల్లో పరిస్థితులు క్షీణించినప్పటికీ, సీఐ కొండలరావు స్వయంగా తన టీంతో కలిసి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తక్షణ స్పందన, ప్రజలతో నేరుగా మమేకం అవుతూ నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారా ఎన్నో కుటుంబాలు తుపాను ప్రభావం బారిన పడకుండా రక్షించారు.
ఈ విపత్తు సమయంలో ఆయన చూపిన చొరవ,ప్రజలకు అందించిన సేవలను అధికారులతోపాటు ప్రజలు కూడా ప్రశంసిచారు. సీఎం నుంచి ప్రత్యేక సన్మానం, ప్రశంసాపత్రం పొందిన సీఐ కొండలరావుకు శుక్రవారం పలువురు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


