డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 క్యాన్సర్ నయమైందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందన్న భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ లీగల్ నోటీసు పంపింది. ఏడు రోజుల్లోగా భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నోటీసులో పేర్కొంది.సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన క్షమాపణలు చెప్పాలని కోరింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. ఇక సిద్ధూ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన ఆంకాలజిస్టులు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని వైద్యులు అన్నారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి తన ప్రకటనలో పేర్కొంది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది.
కాగా, స్టేజ్-4 క్యాన్సర్ నుంచి తన భార్య పూర్తిగా కోలుకోవడంపై విలేకరుల సమావేశంలో సిద్ధూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్వదేశీ ఆహారం వల్లనే కేవలం 40 రోజుల్లోనే ఆమె పూర్తిగా కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. తన భార్య 4వ దశ క్యాన్సర్‌ను అధిగమించడంలో డైట్ కంట్రోలే ప్రధాన కారణమని సిద్ధూ తెలిపారు.
అందులోనూ పాల ఉత్పత్తులు, చక్కెర వంటివి తినకపోవడం.. హల్దీ (పసుపు), వేప, తులసి వంటివి తినడం ద్వారా క్యాన్సర్‌ను జయించవచ్చని సిద్ధూ చెప్పారు. అలా చేయడం వల్లే తన భార్య స్టేజ్-4 క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని చెప్పుకొచ్చారు.