Homeఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోపై వివాదం.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోపై వివాదం.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో విషయంలో దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ధర్మాసనం కోట్టేసింది. డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందని కోర్టు ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారని పేర్కొంటూ కోర్టు పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే పిల్‌లు వేయాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ పిల్ రాజకీయ దృష్టితో, ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసినట్లుగా కోర్టు అభిప్రాయపడింది. ప్రజల మంచి కోసం కోర్టుకు వెళ్లడం అందరి బాధ్యత అని కోర్టు తెలిపింది. రాజకీయ లబ్ధికోసం కోర్టును వాడుకోవడం సరికాదని హైకోర్టు హెచ్చరించింది. నిజమైన ప్రజా ప్రయోజనాల పిటిషన్లను మాత్రమే విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇది ప్రజల బాధ్యతని.. సమాజానికి ఉపయోగపడే విషయాలపై వేసిన పిటిషన్లను మాత్రమే కోర్టు పరిశీలిస్తుందని అభిప్రాయపడింది. రాజకీయ కారణాలతో కోర్టుకు రావడం మంచిది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు చట్టబద్ధంగా అనుమతి లేకుండా పెడుతున్నారని రైల్వే ఉద్యోగి కొండలరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఫోటోల విషయంలో ప్రభుత్వం ఒక విధానం తీసుకునే వరకు డిప్యూటీ సీఎం ఫోటోలను తొలగించాలని కొండలరావు కోరారు. ఈ పిల్‌లో జీఏడీ ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, పౌరసంబంధాలశాఖ డైరెక్టర్‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోల అంశంపై సమాచార హక్కు చట్టం కింద కొండలరావు దరఖాస్తు చేశారు. దీనికి సమాధానంగా, ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఎలాంటి జీవోలు, మార్గదర్శకాలు లేవని సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి, ఉప డిప్యూటీ సీఎంల ఫోటోలు ప్రదర్శించమని ప్రభుత్వం కార్యాలయాలకు ఆదేశాలు ఇవ్వలేదని కూడా స్పష్టం చేసింది. 2024 నుంచి ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. ఈ క్రమంలో కొండలరావు ఈ పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి స్పష్టంగా చెప్పలేదంటున్నారు. రాజ్యాంగంలోని అధికరణ 164లో ఈ విషయం లేదని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ ముఖ్యమంత్రిని, ఇతర మంత్రులను నియమిస్తారని మాత్రమే అందులో ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం పక్కన డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం సరికాదని కొండలరావు వాదన.అలా చేయడం వల్ల రెండు పదవులు సమానమని ప్రజలు అనుకుంటారని పేర్కొన్నారు. అయితే కొండలరావు పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు