జంతర్ మంతర్ వద్ద ఆప్ భారీ ర్యాలీ
న్యూదిల్లీ: అధికార భాజపా గద్దె దిగేందుకు ‘కౌంట్ డౌన్్ణ మొదలైందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఆప్ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దిల్లీలోని జంతర్ మంతర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఆదివారం ప్రసంగించారు. ‘‘మోదీ, అమిత్ షాలు మద్యం కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. ఆ కేసులో నన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. నేను నీతిపరుడనని ఈ తీర్పుతో రుజువైంది. ఎవరిని చూసినా మోదీ భయపడిపోతున్నారు. శాస్త్రవేత్త, బాలల విద్య కోసం పనిచేసిన వాంగ్చుక్కు భయపడి ఆయనను జైలుకు పంపారు. మహిళా ఎంపీలు దాడి చేస్తారేమోనని బెదిరి పార్లమెంటుకు వెళ్లలేదు. ట్రంప్‌నకు కూడా మోదీ భయపడతారు. ఓ నియంత భయపడ్డాడంటే అది అతని పాలనకు ముగింపని అర్థం. మోదీకి దేశమంటే లెక్కలేదు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతూ అధికారంలో ఉంటున్నారు. 12 ఏళ్ల భాజపా పాలనలో మౌలిక వసతులతో సహా దేశంలో నాశనం కాని రంగమే లేదు. 2011లో జరిగిన జంతర్ మంతర్ సభ.. కాంగ్రెస్‌ను గద్దె దించింది. ఇప్పుడు జరుగుతున్న సభతో తొందర్లోనే భాజపాకూ అదే గతి పట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైంది్ణ్ణ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోదియా, ఆతిశీ, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.


