బ్లాక్‌మార్కెట్, దళారీ వ్యవస్థను అరికట్టడంలో పాలకుల వైఫల్యం
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు.చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి
విశాలాంధ్ర ధర్మవరం;;నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పేదలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయని ధర్మవరం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవి కుమార్ అధ్యక్షత వహించడం జరిగింది.ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ 2014తో పోలిస్తే నేడు సామాన్యుడి వంటింటి ఖర్చు ఎంతగా పెరిగిందో కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు. బియ్యం కిలో రు.28.06 నుంచి 45.69కు, కందిపప్పు రూ.75.94 నుంచి 122.06కు, సన్‌ఫ్లవర్ నూనె రూ.93.55 నుంచి 192.40కు, చక్కెర రూ 34.02 నుంచి 60.78కు, ఉల్లిపాయ రూ.26.46 నుంచి 50.19కు, టమాటా రూ.21.44 నుంచి 37.67కు పెరిగాయని వారు వివరించారు వివరించారు. అంటే నూనె ధర రెట్టింపుకు పైగా, ఉల్లిపాయ ధర దాదాపు రెట్టింపు, చక్కెర ధర 79 శాతం, టమాటా 76 శాతం, బియ్యం 63 శాతం, కందిపప్పు 61 శాతం పెరిగాయి. ధరలు ఇంతగా పెరుగుతుంటే ప్రజల ఆదాయాలు అదే స్థాయిలో పెరిగాయా అని ప్రశ్నించారు. “రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు అని,. వినియోగదారుడు కొనాలంటే అధిక ధర కలదన్నారు. మరి ఈ ధరల మధ్యలో లాభపడుతున్నది ఎవరు?” అని ప్రశ్నించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, దళారీ వ్యవస్థ, కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెట్ కారణంగా ప్రజలు నష్టపోతున్నారని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వమే 22 నిత్యావసర వస్తువుల ధరలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నప్పటికీ, మార్కెట్లో ధరల మంట ఎందుకు అదుపులోకి రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ధరలను పర్యవేక్షిస్తున్నాయి కానీ ప్రజల జేబులను ఎవరు పర్యవేక్షిస్తారు?” అని నిలదీశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బ్లాక్‌మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు నుంచి వినియోగదారుడి వరకు మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను నియంత్రించి, రైతుకు గిట్టుబాటు ధర– వినియోగదారుడికి సరసమైన ధర కల్పించాలని వారి డిమాండ్ చేశారు. రైతుబజార్లను బలోపేతం చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారాన్ని తగ్గించి రవాణా ఖర్చులను తగ్గించాలని, దాని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలను కూడా తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం, వ్యాట్ తో పాటు ఇతర సెస్సులు, డీజిల్‌పై 22.25 శాతం వాట్ తో పాటు ఇతర సెస్సులు ఉన్నాయని అధికారిక పి పి ఎ సి గణాంకాలు చూపిస్తున్నాయని వారు తెలిపారు
రైతుకు గిట్టుబాటు ధర – వినియోగదారుడికి సరసమైన ధర కల్పించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శులు ఎర్రం శెట్టి రమణ,శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కుల్లాయప్ప, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, మీటర్ రీడర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, మహిళా సమైక్య లీడర్స్ లలితమ్మ లింగమ్మ మరియు పట్టణ కార్యవర్గ సభ్యులు, ఆదినారాయణ, శ్రీనివాసులు,సుబ్రహ్మణ్యం, నారాయణస్వామి,తదితరులు పాల్గొన్నారు.


