మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. క్యుములోనింబస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ‘‘గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దీంతో వేర్వేరు వర్ష సంబంధిత ఘటనల్లో 89 మంది మృతి చెందారు. మరో 53 మంది గాయపడ్డారు. 114 జంతువులు మరణించాయి. 87 ఇళ్లు ధ్వంసమయ్యాయి్ణ్ణ అని యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరాతీసినట్లు తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారని, వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు ఆదేశించినట్లు పేర్కొంది.
ప్రయాగ్‌రాజ్, భదోహి, సోన్‌భద్ర, ఫతేపుర్ తదితర జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌లో 21 మంది, భదోహిలో 16, ఫతేపుర్‌లో 11, సంత్ రవిదాస్ నగర్లో 14, మీర్జాపుర్‌లో 10 మంది మృతి చెందినట్లు ఆయా జిల్లాల యంత్రాంగం వెల్లడించింది. ఈ జిల్లాల్లో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.
సాధారణంగా మే నెలలో ఉత్తర భారతంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలాచోట్ల సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఆ సమయంలో భూఉపరితలంపై ఉండే గాలి విపరీతంగా వేడెక్కుతుంది. అది వేగంగా కదులుతూ ఇతర దిశల నుంచి తడిగాలిని లాగేసుకుంటుంది. ఈ రెండు కలిసి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశమంతా విస్తరిస్తాయి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే భారీ వర్షం, వడగళ్లు, పిడుగులు పడుతాయి. ఇప్పుడు యూపీలో ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈదురు గాలులకు ఎగిరిపడి..
బరేలీ జిల్లాలో బలమైన ఈదురు గాలుల కారణంగా ఓ వ్యక్తి ఎగిరిపడ్డాడు. గాలిదుమారం రావడంతో సదరు వ్యక్తి ఓ షెడ్డును పట్టుకుని నిలబడ్డాడు. అయితే గాలి తీవ్రతకు షెడ్డుతో సహా ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో గాయపడిన అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


