Homeజాతీయంవిదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.... యూపీఐ విధానాలపై కేంద్రం కీలక ప్రకటన

విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు…. యూపీఐ విధానాలపై కేంద్రం కీలక ప్రకటన

- Advertisement -

యూపీఐ విధానాలపై విదేశీ ప్రభావం ఉందన్న ప్రచారాన్ని ఖండించిన కేంద్రం
వినియోగదారులకు యూపీఐ సేవలు పూర్తిగా ఉచితమని మరోసారి స్పష్టత

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. యూపీఐకి సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పూర్తిగా స్వతంత్రంగా తీసుకుంటామని బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌్ణ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.విదేశీ ప్రభావం ఉందంటూ వస్తున్న వాదనలు పూర్తిగా అసత్యం అని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. 2016లో ప్రారంభమైన నాటి నుంచి యూపీఐ పూర్తిగా భారతీయ నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందిందని, ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేసింది. కేవలం 2026 ఆగస్టు నెలలోనే యూపీఐ ద్వారా 24.5 బిలియన్ల లావాదేవీలు జరిగాయని తెలిపింది.

ఛార్జీలు ఎందుకంటే..
ఈ చెల్లింపుల వ్యవస్థను స్వయం సమృద్ధంగా, సురక్షితంగా, వినూత్నంగా కొనసాగించేందుకే అధిక విలువ గల వ్యాపార లావాదేవీలపై స్వల్ప రుసుము విధించినట్లు కేంద్రం వివరించింది. ఈ రుసుము ద్వారా సమకూరే నిధులను మెరుగైన మౌలిక వసతులు, సైబర్‌ సెక్యూరిటీ, గ్రామీణ ప్రాంతాలు, టైర్ III–VI  పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు మద్దతు, యూపీఐ వినియోగంపై అవగాహన కల్పించేందుకు వినియోగిస్తామని పేర్కొంది.

యూపీఐ వినియోగదారులకు ఎప్పటిలాగే అన్ని సేవలు ఉచితంగానే అందుబాటులో ఉంటాయని కేంద్రం పునరుద్ఘాటించింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వంటి వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా సంపాదించే వ్యాపారులకు కూడా ఛార్జీల నుంచి మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది. దేశంలో జరిగే 95 శాతానికి పైగా వ్యాపార చెల్లింపులు రూ.2,000 లోపే ఉంటాయని, వీటికి ఎలాంటి రుసుము లేదని పేర్కొంది.

వ్యాపారులకే స్వల్ప రుసుము
రూ.2,000 దాటిన పెద్ద వ్యాపార లావాదేవీలపై మాత్రమే 0.4% మేర స్వల్ప రుసుము ఉంటుందని, ఇది కూడా వ్యాపారులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ రుసుము క్రెడిట్ కార్డ్ ఛార్జీలతో పోలిస్తే చాలా తక్కువని వివరించింది. రైల్వే, ఇంధనం, టెలికాం, బీమా, బిల్లు చెల్లింపుల వంటివాటికి రూ.2,000 దాటిన లావాదేవీపై రూ.5 ఫ్లాట్ ఫీజు ఉంటుందని తెలిపింది.

మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీస్ చెల్లింపులపై 0.02% రుసుము ఉంటుందని, దీనికి గరిష్ఠ పరిమితి రూ.300 అని పేర్కొంది. వ్యాపారులు ఈ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని, అలాగే యూపీఐ యాప్‌లు ప్లాట్‌ఫామ్ ఛార్జీలు విధించకూడదని కేంద్రం కఠిన నిబంధనలు విధించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు