పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.. వాహనాల దారి మళ్లింపు
రాస్తారోకో నిర్వహిస్తున్న దృశ్యం
విశాలాంధ్ర – ఉరవకొండ: అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు సమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువ వద్ద అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై నిర్వహించిన ఈ ఆందోళన వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. విడపనకల్లు, వజ్రకరూరు మండలాలకు చెందిన రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. హెచ్ఎల్సీ, జీబీసీ, హంద్రీనీవా కాలువల ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయకట్టు భూములకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారీగా పోలీసుల మోహరింపు
రైతులు రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం, ఉరవకొండ నుంచి బళ్లారి వైపు వెళ్లే వాహనాలతో పాటు బళ్లారి నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. దీంతో కొంతసేపు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంగా వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
హెచ్ఎల్సీకి ప్రస్తుతం 16 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, అందుబాటులో ఉన్న నీటిలో అనంతపురం జిల్లా రైతులకు న్యాయమైన వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆరుతడి పంటలను కాపాడేందుకు అవసరమైన నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. హెచ్ఎల్సీ, జీబీసీ, హంద్రీనీవా ఆయకట్టు భూములకు స్పష్టమైన సాగునీటి ప్రణాళికను ప్రకటించి, దాని ప్రకారం నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో నిరంతరం కరువు పరిస్థితులు నెలకొంటున్నందున నీటి కేటాయింపుల్లో అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
సాగునీటి విడుదలపై ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, రైతుల పంటలు ఎండిపోకుండా అత్యవసర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి వద్ద అనంతపురం జిల్లా రైతుల సాగునీటి సమస్యను బలంగా ప్రస్తావించి తక్షణమే నీటిని విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.


