Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకన్లపాటు కంపించింది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు సమాచారం. మేడారంలో సెప్టెంబర్ 4న లక్ష వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 గంటలకు కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్లపాటు ఇళ్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. భయాందోళనతో రోడ్లుపైకి పరుగులు పెట్టారని వాపోతున్నారు.

తూ.గో.జిల్లా దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో భూమి కంపించినట్లు సమాచారం. రాజమండ్రి తాడితోట, మోరంపూడి ప్రాంతాల్లో సెకన్లపాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఉదయం ఏడు గంటల సమయంలో సెకన్లపాటు భూమి కంపించింది. ప్రకంపనల ధాటికి ఇళ్లల్లోని వస్తువులు సైతం కిందపడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్పల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిస్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెప్పారు.గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని సమాచారం. బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్, యూసుఫ్‌గూడాలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ స్వల్పంగా కంపించిందని సమాచారం. నల్గొండ పట్టణం, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం పాతర్లపాడు, నూతనకల్, హుజూర్ నగర్‌ ప్రాంతాల్లో సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని సమాచారం. ఉదయం 7:28 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున వారు సైతం కిందపడిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇళ్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగురు తీశారు. కరీంనగర్‌ విద్యానగర్‌లోనూ భూమి కంపించిందని సమాచారం. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు