విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని హంపాపురం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఎలెక్ట్రోమానియా 2కె26” జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమం మార్చి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంస్థ కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్కేయూ అటల్ ఇన్క్యూబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి. చంద్ర మౌళి హాజరై మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు సాగిన ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థుల కోసం పీపీటీ ప్రెజెంటేషన్, సర్క్యూట్ హంట్, క్విజ్, ప్రాజెక్ట్ ఎక్స్పో మరియు పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి వివిధ పోటీలను నిర్వహించారు. ఇందులో అనేక మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. మొదటి రోజు ప్రారంభోత్సవంతో పాటు సాంకేతిక ఈవెంట్లు జరగ్గా, రెండో రోజు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. వి. రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయ భాస్కర్, ఈసీఈ విభాగాధిపతి డాక్టర్. వి. వెంకటేశ్వర రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ వి. షావలి తో పాటు ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ‘ఎలెక్ట్రోమానియా 2కె26’
- Advertisement -


