Homeఅంతర్జాతీయం9న ఫైనల్ యాక్షన్

9న ఫైనల్ యాక్షన్

- Advertisement -

పాకిస్థాన్‌కు పీఓజేకే నేతల అల్టిమేటం
ముజఫరాబాద్:
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓజేకే)లో నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే…జులై 9న ఫైనల్ యాక్షన్‌ను ప్రారంభిస్తామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) తాజాగా పాక్ సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. తమ నిరసనల్లో భాగం కావాలని పీఓజేకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. ఆ రోజున పీఓకేలో పర్యటించాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఐరాస ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవహక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఆ డెడ్‌లైన్ గడువు వరకు క్షమశిక్షణతో వ్యవహరించాలని తన మద్దతుదారులను కోరింది. గత కొన్నిరోజులుగా పీఓజేకేలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనలకు మద్దతు ఇస్తున్న జేఏఏసీని పాక్ ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నిషేధించింది. ఈ కమిటీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తలను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నిరసనకారులను అణచివేయడానికి పీఓజేకేలోకి వెళ్తున్న నిత్యావసర సరకులు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులను ప్రభుత్వం అడ్డుకుంది.
పాక్ దురాగతాలు గమనించాలి…
పాక్ ప్రభుత్వ అణచివేతలు, పౌరుల హత్యలను అంతర్జాతీయ సమాజం గమనించాలని జేఏఏసీ అభ్యర్థించింది. నిరసల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించింది. సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోవద్దని, నిర్బంధంలో ఉన్న తమ నాయకులను విడిచిపెట్టాలని, 38 పాయింట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది.
భారత్ సహాయం కావాలి…
జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడినట్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘మాకు భారత్ సహాయం కావాలి. ఆహారపదార్థాలు, నిత్యావసరాల కొరత ఉంది. మానవతా సాయం అందించండి’ అని ఆయన కోరినట్టుగా ఆ వీడియోలో ఉండటం గమనార్హం. నిరసనలను కఠినంగా అణచివేస్తోన్న పాక్…ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిదని అందులో ఆరోపించారు. పరిస్థితులు మరింత దిగజారితే పౌరులు భారత్‌కు వచ్చేందుకు వీలుగా నియంత్రణ రేఖ వెంట సరిహద్దును తెరవాలని అమన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు