Homeజిల్లాలుచిత్తూరుమాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత

- Advertisement -


. గాంధీజీతో కలిసి సాగిన స్వాతంత్ర్య సమరయోధుడు
. రూ. 2,500 ఎన్నికల ఖర్చుతో గెలిచిన అరుదైన నేత

విశాలాంధ్ర-చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువైన శకం ముగిసింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు టీసీ రాజన్ (108) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆడంబరాలు ఎరుగని జీవనం, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు చిరునామాగా నిలిచారు. శతాధిక వృద్ధుడైన రాజన్ మరణంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
గాంధీజీ అడుగుజాడల్లో
1918 సెప్టెంబరు 11న పలమనేరు సమీపంలోని రాయపేటలో అన్నయ్యగౌడ్, భద్రాంబ దంపతులకు టీసీ రాజన్ జన్మించారు. చిన్నతనం నుంచే దేశభక్తిని పుణికిపుచ్చుకున్న ఆయన, జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీజీతో నేరుగా పరిచయం కలిగి, ఆయనతో కలిసి నడిచిన అతికొద్ది మంది సమరయోధులలో రాజన్ ఒకరు. ఆయన మరణం కేవలం జిల్లాకే కాకుండా, రాష్ట్ర రాజకీయ రంగానికి తీరని లోటు.
రూ. 2,500తో ఎమ్మెల్యేగా విజయం…
నేటి కాలంలో ఎన్నికలంటే కోట్ల రూపాయల ఖర్చు, ఆడంబరాలు కనిపిస్తాయి. కానీ, 1967 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్, కేవలం రూ. 2,500 వ్యయంతోనే పలమనేరు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. డబ్బును కాకుండా ప్రజల నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి, 1967 నుంచి 1972 వరకు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు.
సొంత స్థలం కూడా తీసుకోని ‘నిస్వార్థ’ నేత
అధికారంలో ఉంటే ఆస్తులు కూడబెట్టుకోవడం సామాన్యంగా మారిన ఈ రోజుల్లో, ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినా టీసీ రాజన్ తన పదవీ కాలంలో ఒక్క సెంటు భూమిని కూడా సంపాదించుకోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత లాభం పొందాలనే ఆలోచన ఆయనకు ఎన్నడూ రాలేదు. పదవి ముగిసిన తర్వాత కూడా అత్యంత సామాన్యుడిలా నిరాడంబరంగా జీవిస్తూ ప్రజాసేవకే అంకితమయ్యారు. ఆయన నడిచిన బాట నేటి తరం రాజకీయ నాయకులకు ఒక గొప్ప పాఠం.
మౌనంగా నిష్క్రమించిన మహా మనిషి
ఖరీదైన కార్లు, భవంతులు లేకపోయినా లక్షలాది మంది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారాయన. చివరి శ్వాస వరకు తన నైతిక విలువలను వదలని ఈ నిరాడంబర నేత మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు