ఏపీ రాజధాని అమరావతి.. ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. భారతదేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌కు అమరావతి వేదిక కానుంది.
ఈ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, గ్లోబల్ టెక్ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ, లక్షలాది మంది యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తిచేసి, డిసెంబర్‌లోపు క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో అమరావతి.. క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా ఏపీ మంత్రులు నారా లోకేశ్, నారాయణ, కందుల దుర్గేశ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


