Homeజాతీయంఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

- Advertisement -

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కోనున్న మొత్తం నష్టాల్లో ఈ ఉపశమనం దాదాపు 15 శాతానికి సమానం.

అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశంలో రిటైల్ ధరలను స్థిరంగా ఉంచడంతో ఆయిల్ కంపెనీలు రోజుకు రూ. 1,000 కోట్లు, ఏడాదికి సుమారు రూ. 3.6 లక్షల కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయని ప్రభుత్వ అంచనా. తాజా పెంపుతో ఈ నష్ట భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు అవకాశం లభించింది.

ఈ ధరల పెంపు వల్ల ఇంధన వినియోగంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండదని ఎస్‌బీఐ రీసెర్చ్ స్పష్టం చేసింది. ధరలు పెరిగిన వెంటనే వినియోగం తగ్గినా, ఏడాదిలోపే తిరిగి పుంజుకుంటుందని గత గణాంకాలు సూచిస్తున్నాయని వివరించింది. అయితే, మే-జూన్ 2026 నెలల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణంపై 15-20 బేసిస్ పాయింట్ల తక్షణ ప్రభావం ఉండొచ్చని, దీంతో FY27 ద్రవ్యోల్బణం అంచనాను 4.7 శాతానికి సవరిస్తున్నట్లు పేర్కొంది.

అయితే, రూపాయి విలువ క్షీణించడం ఈ ప్రయోజనాలకు గండికొట్టే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో రూ. 2 పతనమైతే, ధరల పెంపు ద్వారా వచ్చే లాభం పూర్తిగా హరించుకుపోతుందని స్పష్టం చేసింది. రూపాయి విలువ ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకున్నందున, మరింత బలహీనపడితే ఇంధన ధరల పెంపు లక్ష్యం నెరవేరదని విశ్లేషించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు