మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి. జగదీష్
విశాలాంధ్ర–అనంతపురం కార్పొరేషన్: హంద్రీ–నీవా మెయిన్ కెనాల్ నుంచి రాగులపాడు వద్ద ఉపకాలువ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి. జగదీష్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు. ఆదివారం మంత్రి నివాసంలో ఆయనను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ.. రాగులపాడు నుంచి ఉపకాలువ నిర్మించి వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి మండలాల్లోని వ్యవసాయ భూములు, చెరువులు, చెక్‌డ్యామ్‌లకు కృష్ణా జలాలను అందిస్తామని 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా పామిడిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ ఉపకాలువకు గతంలోనే పరిపాలనా అనుమతులు ఇచ్చామని, అవసరమైన నిధులు మంజూరు చేసి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేసి మూడు మండలాలకు కృష్ణా జలాలను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాయాపురం, అమరావతి, అసెంబ్లీలో గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం, ప్రజలకు హామీలు ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటివరకు నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ ఉపకాలువ నిర్మాణం పూర్తయితే వజ్రకరూరు మండలంలోని రాగులపాడు, గూళ్లపాలెం తదితర గ్రామాల వ్యవసాయ భూములతో పాటు గుంతకల్లు మండలంలోని ధోనిముక్కల, మల్లేనిపల్లి, పులిగుట్టుపల్లి, నల్లగొండ, నల్లదాసరిపల్లి, వెంకటంపల్లి, చింతలపల్లి, నాగసముద్రం, గుర్రప్పాడు, ఇమాంపురం తదితర గ్రామాల చెరువులు, చెక్‌డ్యామ్‌లకు నీరు అందుతుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు రీచార్జ్ కావడంతో బోరుబావుల్లో నీటిమట్టాలు పెరిగి రైతులకు రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.జగదీష్ విజ్ఞప్తిపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


