ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారడం వల్ల వరి దిగుబడులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే, కరువు పరిస్థితులను తట్టుకునే వరి రకాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేశారు. ఇదే దిశగా బ్రిటన్‌లో కూడా విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ పరిణామాలు వ్యవసాయ రంగానికి ఆశాజనకంగా మారాయి.
హెచ్‌ఎంజీబీ జన్యువు గుర్తింపు
కరువు పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ నీటితో వరి సాగుకు సహకరించే హెచ్‌ఎంజీబీ అనే కీలక జన్యువును చైనా పరిశోధకులు గుర్తించారు. వారు మొత్తం 16 రకాల వరి మొక్కలపై అధ్యయనం నిర్వహించి, వాటి వేర్ల నిర్మాణం, జన్యు కార్యకలాపాలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో వేర్ల అభివృద్ధికి సంబంధించి 376 జన్యువులను గుర్తించగా, అందులో హెచ్‌ఎంజీబీ1 ప్రధాన పాత్ర పోషించినట్లు తేలింది.
శాస్త్రవేత్తల పరిశోధన..
ఈ జన్యువు వేర్ల పెరుగుదల వేగాన్ని నియంత్రిస్తుంది. సాధారణంగా నీటి కోసం భూమి లోతుల్లోకి వెళ్లే వేర్ల పెరుగుదలను ఇది తగ్గిస్తుంది. ఫలితంగా వేర్లు లోతుగా వెళ్లకుండా, ఉన్న ప్రాంతంలోనే మందంగా మరియు దృఢంగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా పొడి వాతావరణంలో మొక్కలు బలంగా నిలదొక్కుకోవడానికి ఈ లక్షణం ఉపయోగపడుతుంది. వేర్లు భూమిలోకి నిటారుగా చొచ్చుకుపోయే ప్రక్రియను ఈ జన్యువు నియంత్రించడం వల్ల మొక్కలకు కరవును తట్టుకునే శక్తి మరింత పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.
బ్రిటన్‌లోనూ పరిశోధనలు..
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునే జన్యు వైవిధ్యంతో కూడిన వరి మొక్కలను అభివృద్ధి చేయడంపై బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం సట్టన్ బోనింగ్టన్ క్యాంపస్‌లోని గ్రోత్ రూమ్స్‌లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులకు వివిధ రకాల మొక్కలు ఎలా స్పందిస్తున్నాయో అక్కడ అధ్యయనం చేస్తున్నారు. అదేవిధంగా, వాతావరణ మార్పుల కారణంగా వేర్లపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు విశ్వవిద్యాలయంలోని హాన్స్‌ఫీల్డ్ ఫెసిలిటీలో వరి మొక్కలను మైక్రో-సీటీ స్కానర్ సాయంతో పరిశీలిస్తున్నారు. భూమి లోతుల్లోకి నిటారుగా పెరిగే వేర్లు ఎక్కువ నీటిని సేకరించే సామర్థ్యం కలిగి ఉంటాయని, ఆ లక్షణాన్ని నియంత్రించే జన్యువులను గుర్తించి భవిష్యత్ వరి రకాల అభివృద్ధిలో వినియోగించాలని భావిస్తున్నట్లు హాన్స్‌ఫీల్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రెయిగ్ స్టర్రాక్ తెలిపారు.
ఈ పరిశోధనలు ఎందుకు కీలకం?
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వరి పంటలో సుమారు 75 శాతం నీటిపారుదల వ్యవస్థలపైనే ఆధారపడి ఉంటుంది. చైనాలో వ్యవసాయ రంగానికి వినియోగించే మొత్తం నీటిలో దాదాపు 70 శాతం వరి సాగుకే వెచ్చిస్తున్నారు. అలాగే వరి ఉత్పత్తిలో ముందున్న ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలు కూడా నీటిపారుదల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే వరి రకాల అభివృద్ధికి దోహదపడే తాజా పరిశోధనలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. అంతేకాకుండా, భవిష్యత్తులో ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించే అవకాశముంది.


