విశాలాంధ్ర-తాడిపత్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ ఒక ప్రకటనలో చెప్పారు. బుధవారం డాక్టర్ సుమన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశామన్నారు. వైద్యుల సమస్యలైనటువంటి ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలన్నారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబల్ అలవెన్స్ మంజూరు చేయాలన్నారు. నోషనల్ ఇన్‌క్రిమెంట్స్ మంజూరు, చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రామ్ కింద వైద్యులకు 5వేలు అలవెన్స్, నేటివిటీ, అర్బన్ ఎలిజిబిలిటీ, పీహెచ్సీ వైద్యులకు ఖచ్చితమైన పనిగంటలు, స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


