గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారాలే.
కనుచూపులో కూడా కనపడని స్వచ్ఛత
ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వ కార్యక్రమాలు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సోక్ పిట్స్ ప్రారంభించడం, చెత్త నుండి సంపద కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకొని రావడం చేసినప్పటికీ, కొంత మంది అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలకు చేరకపోవడమే కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలు నీరుకారుతున్నాయి. దీనిపై మండల స్థాయి, పైస్థాయి అధికారులు దృష్టి పెట్టవలసి ఉంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం ప్రైడే డ్రై డే వంటి కార్యక్రమాలు ఫొటోలకే పరిమితం కాకుండా, నూరుశాతం జరిగేలా చూసి, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వలేటివారిపాలెం మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కొంతమంది పంచాయతీ కార్యదర్శులకు అయిష్టంగా మారింది. ప్రభుత్వ ప్రజా కార్యక్రమాలపై నిర్లక్ష్యం వహించేలా, స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి మంగళం పాడి గ్రామాలను చెత్త చెత్తగా మార్చి వేసి, ప్రజా ఆర్యోగ్యంతో అధికారులు, సిబ్బంది చెలగాట మాడటమే కాకుండా, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. వలేటివారిపాలెం మండలం పోకూరు జాతీయ రహదారి ఆనుకొని ఉన్న హైస్కూల్ ప్రక్కన పరిసరాలు అధ్వాన్నంగా మారాయి. జాతీయ రహదారి వెంబడి రోజుల తరబడి ఉన్న చెత్తను తొలగించడం మరచిపోయారు. ఆటపాటలు మరియు విద్యను అభ్యసించే స్కూలు పక్కనే పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల చెత్త మరియు వ్యర్ధాలు నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతూ, అనేక రకాల రోగాలకు నిలయంగా అవి దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఎంతో పరిష్టాత్మంగా చేపట్టిన ఈ బృహత్తర స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించకుండా, ప్రత్యేక దృష్టి పెట్టి దిగ్విజయం చేసి ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా అడుగులు వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా తమ సిబ్బందిపై విధినిర్వహణపై మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రభుత్వ పథకాలు నూరుశాతం ప్రజలకు చేరువయ్యేలా దృష్టి కేంద్రీకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


