అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. కాగా, ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ను గ్రామీ అవార్డు వరించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆయన రచించిన ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్ కు బెస్ట్ ఆడియోబుక్ నేరేషన్ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్ కార్టర్ అందుకున్నారు. జిమ్మీ కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేశారు. తన పదవీకాలంలో ప్రపంచ శాంతి కోసం ఆయన కృషి చేశారు. 1980 ఎన్నికల్లో ఆయన ఓడిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రపంచ శాంతికి కృషి చేసినందుకు గాను 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.