సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర అనంతపురం : పట్టాల పేరుతో దందా చేస్తున్న వారిని అరికట్టాలని పట్టాలు ఇప్పించే ఘనత ఒక్క సిపిఐ కె చెందుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పాతూరు లోని వీరబ్రహ్మం దేవాలయం వద్ద ఉన్న పలు కాలనీలలో సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో ఇంటి పట్టాల దరఖాస్తు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి సి జాఫర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాల్లో ఇంటి పట్టాలి ఇప్పిస్తామని పేద ప్రజల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్న సంగతి తెలియడంతో సిపిఐ పార్టీ వారిని గుర్తించి జైలుకు పంపడం జరిగిందన్నారు. ఇంకా మరి కొంతమంది అక్కడక్కడ బ్రోకర్లు తయారవుతున్నారని ఎవ్వరు కాని వారి మాటలు నమ్మి మోసపోకూడదని హెచ్చరించారు. పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్లస్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలి
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇవ్వాలని జనవరి 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఒక సిపిఐ పార్టీ నే పట్టా దరఖాస్తులకు ఎటువంటి రుసుము తీసుకోకుండా పేద ప్రజలకు సేవలందిస్తోందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున దరఖాస్తు సేకరణ చేసి ఆర్డిఓ కి ఇవ్వడం జరిగిందన్నారు.
గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయా ఇళ్లస్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యంకాని ప్రాంతాలలో కేటాయించడం జరిగింది. అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్లస్థలాలు చూపలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చే 1 సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం సరిపోదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు)లు ఆనాడే వైసిపి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఖాతరు చేయకుండా నాటి ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లింది అని పేర్కొన్నారు . కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చినప్పటికీ పేదలు ఆ స్థలాలపట్ల సుముఖత చూపలేదన్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం రూ.1,80,000/-లు మాత్రమే ప్రకటించడం జరిగిందన్నారు. ఆర్థిక సహాయంతో పునాదులు కూడా పూర్తిచేయలేమని పేదలెవ్వరూ కూడా ఇంటి నిర్మాణానికి నోచుకోలేదన్నారు. వైసిపి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాలు, పట్టాలు నిరుపయోగంగా మారిందన్నారు.
తాము అధికారంలోకొస్తే పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇస్తామని; ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున ఇస్తామని గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలకు పెంచి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లస్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, గ్రామాల్లో నివాసయోగ్యంగా, గృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలి అన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన లేఅవుట్లను మార్పుచేసి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్లస్థలాలను కేటాయించాలి. రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి ఒక్క దరఖాస్తు ఆన్లైన్లో ఎక్కించే బాధ్యత తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇండ్ల పట్టాలు ప్రభుత్వం అందించేంతవరకు ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శులు అలిపిర, రమణయ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి సంతోష్ కుమార్, ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్, చాంద్ భాష, నగర కార్యవర్గ సభ్యులు నాగప్ప, మురళి, కమ్మక్క, శ్రీనివాసులు, ఆచారి, భాష తదితరులు పాల్గొన్నారు.