తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ నెల మొదలై చలి పెరుగుతుందని భావించినా, వర్షాలు మళ్ళీ మొదలవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తర భారతదేశం నుండి ప్రారంభమైన నైరుతీ రుతుపవనాలు తెలంగాణకు చేరుకున్నాయని, 24వ తేదీ నుంచి తగ్గుముఖం పడుతాయని వాతావరణ అధికారులు వివరించారు. రుతుపవనాల దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పగలంతా వాతావరణం పొడిగా ఉంటుందని, రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆదివారం రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిశాయి. వలిగొండలో అత్యధికంగా 190.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 131 మిల్లీమీటర్లు, మోతుకూరు మండలంలో దట్టప్పగూడలో 120.5 మిల్లీ మీటర్లు, మహబూబాబాద్ మండలం అయ్యగారి పల్లెలో 117.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలుపుతున్నారు.


