చివరి ఐదు నిమిషాల ఉత్కంఠకు తెరదించి
విజయవంతంగా నింగికెగసిన విక్రమ్-1
శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు
షార్ వేదికగా భారత ప్రైవేట్ అంతరిక్ష
రంగంలో స్వర్ణయుగానికి శ్రీకారం
విశాలాంధ్ర – సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి శనివారం మధ్యాహ్నం నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగసిన విక్రమ్-1తో భారత్ మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆవిష్కృతమైన అంతరిక్ష సామర్థ్యానికి ప్రైవేట్ శక్తిని జోడిస్తూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. శ్రీహరికోట నుంచి ఆకాశాన్ని తాకిన ఆ అగ్నిజ్యోతి
ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది… భారత అంతరిక్ష భవిష్యత్తు ఇక మరింత విస్తృతం, మరింత వేగవంతం కానుంది . హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటల్ ప్రయోగ వాహక నౌక విక్రమ్-1 శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ తొలి ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి ఉదయం 11.30 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉండగా, కౌంట్ డౌన్ చివరి ఐదు నిమిషాల్లో ఒక సాంకేతిక అంశాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు అత్యంత అప్రమత్తంగా ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివే శారు. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ అన్ని వ్యవస్థలను మరోసారి సమగ్రంగా పరిశీలించారు. సమస్య పూర్తిగా పరిష్కారమైన తర్వాత మరో 20 నిమిషాల కౌంట్ డౌన్ నిర్వహించి మధ్యాహ్నం 12.05 గంటలకు విక్రమ్-1ను విజయవంతంగా ప్రయోగించారు. క్షణం క్రితం ఉత్కంఠలో మునిగిన షార్ ప్రాంగణం, మరుక్షణమే చప్పట్లు, హర్షధ్వానాలు, ఆనందోత్సాహాలతో మార్మోగిపోయింది. నాలుగు దశలతో రూపొందించిన విక్రమ్-1 ప్రయోగ వాహకంలో తొలి మూడు దశలు ఘన ఇంధనంతో, చివరి దశ ద్రవ ఇంధనంతో
పనిచేస్తుంది. సుమారు 350 కిలోల వరకు బరువున్న చిన్న
ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టే సామర్థ్యం దీనికి ఉంది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో దేశీయ, విదేశీ పేలోడ్లతో పాటు కాస్మోసర్వ్ స్పేస్ రూపొందించిన ‘మిషన్ ఎంబ్రేస్’ పేలోడు కూడా కక్ష్యలోకి పంపారు. అంతరిక్షంలో పేరుకుపోతున్న శిథిలాలను గుర్తించడం, భవిష్యత్తులో వాటిని తొలగించేందుకు అవసరమైన రోబోటిక్ క్యాప్చర్ సాంకేతికతను పరీక్షించడం ఈ పేలోడ్ ప్రధాన లక్ష్యం. ఈ చారిత్రక ఘట్టానికి ఇన్-స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ కుమార్ గోయెంకా, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్ ఎస్.
ముత్తుచలియన్, ఇన్-స్పేస్ డైరెక్టర్ రాజీవ్ జ్యోతి, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహక అధికారి పవన్ కుమార్ చందన, మరో సహ వ్యవస్థాపకుడు, నాగ భరత్ దాకా, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ప్రయోగం విజయవంతం కాగానే శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పరస్పరం ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఎన్నో ఏళ్ల శ్రమ ఫలించిన ఆ క్షణం అక్కడి ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది. 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తలుపులు తెరిచిన నిర్ణయం భారత అంతరిక్ష
చరిత్రలో కీలక మలుపు కాగా, విక్రమ్-1 విజయం సంస్కరణలకు ప్రత్యక్ష ఫలితంగా నిలిచింది. ఇస్రో తర్వాత స్వదేశీ సాంకేతికతతో ఆర్బిటల్ రాకెట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి భారతీయ ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల రంగంలో భారత ప్రైవేట్ సంస్థలకు ఇది కొత్త అవకాశాల ద్వారాలను తెరిచిందని అంతరిక్ష రంగ నిపుణులు పేర్కొంటున్నారు. శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిసింది ఒక రాకెట్ మాత్రమే కాదు… భారత యువత కలలు, స్వదేశీ సాంకేతిక సామర్థ్యం, దేశ ఆత్మవిశ్వాసం కూడా. ఇస్రో నిర్మించిన బలమైన పునాదులపై భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం తన తొలి స్వర్ణాక్షరాలను లిఖించింది. ఈ విజయగర్జన భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవడమే కాదు, ప్రపంచ అంతరిక్ష పటంలో భారత జెండాను మరింత ఎత్తులో రెపరెపలాడించే శు
భారంభంగా చరిత్రలో నిలిచిపోనుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరవాణి ద్వారా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ ప్రయోగ విజయవంతనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీహరికోట నుండి రాబోవు రోజుల్లో మరిన్ని భారీ ప్రయోగాలు ప్రయోగించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ ఈ మొదటి ప్రయోగం విజయవంతమైనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, శ్రీ సిటీ అధినేత సన్నారెడ్డి రవీంద్రారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగా ప్రసాద్ రాకెట్ విజయవంతం అయినందుకు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు.


