Homeజాతీయంనేటి నుంచి ఇండిగో టికెట్ల ధ‌ర‌ పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం

నేటి నుంచి ఇండిగో టికెట్ల ధ‌ర‌ పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం

- Advertisement -

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడుతోంది.
ఇంధన ధరలు భారీగా పెరగడంతో భారతీయ లో-కాస్ట్‌ విమానయాన సంస్థ ఇండిగో టికెట్‌ ధరలను పెంచాలని నిర్ణయించింది. మార్చి 14 నుంచి దేశీయ, అంతర్జాతీయ అన్ని విమానాల్లో ఫ్యూయల్‌ సర్‌చార్జ్‌ విధించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ అదనపు ఛార్జ్‌ను ప్రయాణికులపై మోపాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. ప్రయాణించే ప్రాంతాన్ని బట్టి టికెట్‌ ధరలు రూ.425 నుంచి రూ.2,300 వరకు పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రభావం పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది.

జెట్‌ ఫ్యూయల్‌ ధరల పెరుగుదల
యుద్ధానికి ముందు బ్యారెల్‌ చమురు ధర సుమారు 85-90 డాలర్ల మధ్య ఉండగా, ప్రస్తుతం అది 150 నుంచి 200 డాలర్ల వరకు పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) జెట్‌ ఫ్యూయల్‌ మానిటర్‌ ప్రకారం ఈ ప్రాంతంలో ఇంధన ధరలు 85 శాతం కంటే ఎక్కువగా పెరిగాయని ఇండిగో తెలిపింది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో జెట్‌ ఫ్యూయల్‌ లేదా ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ATఖీ) దాదాపు 40 శాతం వాటా కలిగి ఉండటంతో ఈ పెరుగుదల పెద్ద ప్రభావం చూపుతోందని సంస్థ పేర్కొంది. టికెట్‌ ధరలను మరింతగా పెంచాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రయాణికులపై భారం తగ్గించేలా తక్కువ స్థాయిలోనే పెంపు చేస్తున్నామని ఇండిగో తెలిపింది.

ప్రయాణికులు ఎంత అదనంగా చెల్లించాలి?
ప్రయాణించే ప్రాంతాన్ని బట్టి ఫ్యూయల్‌ సర్‌చార్జ్‌ ఇలా ఉంటుంది
భారత్‌లో దేశీయ ప్రయాణాలు: రూ.425
భారత ఉపఖండ దేశాలు: రూ.425
మధ్యప్రాచ్యం: రూ.900
దక్షిణ-ఆసియా, చైనా: రూ.1,800
ఆఫ్రికా, పశ్చిమాసియా: రూ.1,800
యూరప్: రూ.2,300
ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ
ఈ అదనపు ఛార్జ్‌ వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి ఇండిగో క్షమాపణలు తెలిపింది.
పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైనప్పుడు ఛార్జీల్లో మార్పులు చేస్తామని పేర్కొంది.
అలాగే తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించడంలో సంస్థ కట్టుబడి ఉందని తెలిపింది.

ఇతర విమానయాన సంస్థలూ ఇదే దారి
టికెట్‌ ధరలు పెంచిన సంస్థ ఇండిగో మాత్రమే కాదు.
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా మార్చి 10న అన్ని విమాన టికెట్లపై ఫ్యూయల్‌ సర్‌చార్జ్‌ విధిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ నిర్ణయాన్ని మూడు దశల్లో అమలు చేస్తున్నాయి.
మొదటి దశ: మార్చి 12 నుంచి కొత్త బుకింగ్‌లపై
దేశీయ విమానాలు, సార్క్‌ దేశాలకు ప్రయాణాలకు రూ.399
పశ్చిమాసియా / మధ్యప్రాచ్య దేశాలకు 10 డాలర్లు
దక్షిణ-ఆసియా దేశాలు (సింగపూర్‌ సహా)కు 40-60 డాలర్లు
ఆఫ్రికా దేశాలకు 60-90 డాలర్లు

రెండో దశ: మార్చి 18 నుంచి
యూరప్‌ ప్రయాణాలకు 100-125 డాలర్లు
ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా ప్రయాణాలకు 150-200 డాలర్లు
మూడో దశ
హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా మార్కెట్లకు సంబంధించిన సర్‌చార్జ్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఛార్జీలను కాలానుగుణంగా సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని సంస్థలు వెల్లడించాయి.

స్పైస్‌జెట్‌ హెచ్చరిక
ఇక స్పైస్‌జెట్ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ కూడా ప్రభుత్వం జెట్‌ ఫ్యూయల్‌పై పన్నులను తగ్గించాలని కోరారు. లేకపోతే విమానయాన సంస్థలు ఫ్యూయల్‌ సర్‌చార్జ్‌ విధించక తప్పదని ఆయన హెచ్చరించారు.
బ్యారెల్‌కు 90 డాలర్ల చమురు ధర కూడా విమానయాన రంగానికి భారమవుతుందని ఆయన తెలిపారు.
ఇంధన ధరలు ఇలాగే కొనసాగితే విమానాలను నిలిపివేయడం (గ్రౌండింగ్‌) వంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చని, విస్తరణ ప్రణాళికలను కూడా పునఃపరిశీలించాల్సి వస్తుందని ఆయన చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు