పుష్ప-2 సినిమాపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పుష్ప-2 టిక్కెట్ ధరలను స్టార్ హోటల్‌లో ఇడ్లీతో పోల్చారు. సినిమాలు ప్రజాసేవ కోసం నిర్మించరని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 సినిమా టిక్కెట్ ధరలను భారీగా పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాలు అనుమతించాయి. ఈ క్రమంలో ఆయన కథ రూపంలో పోస్ట్ పెట్టారు. ఃసుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1,000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం… వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే.. వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. అప్పుడు నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.ః అంటూ స్టోరీ రూపంలో చెప్పారు.
సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినట్లు…
సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదుః అని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనమవుతుందని ఎద్దేవా చేశారు. ఒకవేళ సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాంః అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది కూడా ఈ సినిమా అని భావించవచ్చునని అభిప్రాయపడ్డారు. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పని చేస్తుందని, అన్ని ఉత్పత్తుల్లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయని పేర్కొన్నారు. కానీ సినిమాలు నిర్మించేది ప్రజాసేవ కోసం కాదని రాసుకొచ్చారు. లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు? వినోదం నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువేనని పేర్కొన్నారు. ఎవరైనా ఇలా ఆలోచించని వారు ఉంటే పుష్ప-2 సినిమాను చూడటం మానేయాలని లేదా ధరలు తగ్గాక చూడాలని సూచించారు. మరోసారి, సుబ్బారావు హోటల్ చైన్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందన్నారు. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు హోటల్లో కూర్చోవడానికి కూడా చోటు ఉండటం లేదని పేర్కొంటూ… సీట్లన్నీ బుక్ అయిపోయాయని పుష్ప-2ని ఉద్దేశించి రాసుకొచ్చారు.