Homeఅక్రమాలు… మోసాలు

అక్రమాలు… మోసాలు

- Advertisement -

గాడితప్పిన వర్సిటీలు, కళాశాలలు

. నకిలీ పీహెచ్‌డీలతో విధులు బ నాణ్యత కొరవడిన చదువులు
. విద్యావ్యవస్థ నిర్వీర్యం బ ఉన్నత విద్యా మండలి మౌనం
. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…
. తల్లిదండ్రులు, విద్యార్థుల డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఉన్నత విద్యామండలి పరిధిలోని కళాశాలల కార్యకలాపాలు గాడితప్పుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ… దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌తోపాటు మిగిలిన విభాగాల కళాశాలల్లో నిబంధనలు పట్టించుకోకుండా అక్రమాలు, మోసాలతో నడుస్తున్న విద్యా సంస్థలు… విద్యార్థులు, బోధనా సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల వరకు కొన్ని చోట్ల నకిలీ పీహెచ్‌డీ ధ్రువీకరణ పత్రాలతో చలామణి అవుతుండటంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్నట్లు ప్రచారం ఉంది. మరోవైపు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సిబ్బంది కొరత పీడిస్తోంది. విద్యార్థులకు అవసరమైన బోధన, సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉండటంలేదు. కేవలం వారి నుంచి ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. చాలా కళాశాలల్లో ఫేక్‌ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో ప్రిన్సిపాల్‌ హోదాలు పొందుతూ అడ్డగోలుగా కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నారు. కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి మధ్యవర్తుల సాయంతో నాణ్యతలేదని పీహెచ్‌డీ పత్రాలను సమర్పించి ఉద్యోగాలు పొందుతున్నారు. ఇందుకు జేఎన్టీయూ పరిధిలోని కొన్ని చోట్ల, విజయవాడ, గుంటూరులోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల సిబ్బంది నిర్వాహకమే నిదర్శనం. ఈ అక్రమాలపై ఉన్నత విద్యామండలికి పదే పదే ఫిర్యాదులు వచ్చినా స్పందన లేకపోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చినపుడు వాటిని బోధనా సిబ్బంది వేతనాలకుగానీ, ప్రయోగశాలల అభివృద్ధికిగానీ వినియోగించకుండా, యాజమాన్యం వాడుకోవడం క్రమంగా కళాశాలల నాణ్యతను దిగజార్చుతోంది. ఫ్యాకల్టీలకు రెండు, మూడు నెలల పాటు వేతనాలు ఇవ్వకుండా… ఫీజు రాలేదన్న నెపంతో ఆ మొత్తాలను సరిచేయడం వంటి చర్యలు పరిపాటిగా మారాయి.
తనిఖీల సమయంలో డమ్మీ ఫ్యాకల్టీలు
కళాశాలలకు అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో డమ్మీ ఫాకల్టీలను ఏర్పాటు చేసి, ఫేక్‌ అకౌంట్లు, ఫోర్జ్‌ ఐడీలు, ఫేక్‌ సంతకాలతో అధికారుల ముందు నిలబెడుతున్నారని తెలిసింది. జేఎన్టీయూ కాకినాడ, అనంతపురం పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేసే పీహెచ్‌డీ అధ్యాపకులు ఎంతోమంది నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా టీచింగ్‌ స్టాఫ్‌ లేకపోయినా ఉన్నట్లు చూపించి ఫార్మాలిటీలను నెరవేర్చడంలో నిమగ్నమవుతున్నారు. ల్యాబ్‌ ఉపకరణాల నాణ్యత నాసిరకంగా ఉన్నప్పటికీ… నిబంధనలకు అనుగుణంగానే ప్రయోగాలు జరిగాయని రికార్డులు సృష్టించి, పరీక్షల సందర్భంగా ఎక్సటర్నల్స్‌ని మేనేజ్‌ చేస్తున్నట్లు సమాచారం. పరీక్షల ఫీజులను విశ్వవిద్యాలయ నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేయడం, ప్రవేశాల సమయంలో రూ.10వేల వరకు భవనాల ఫీజు, అదనపు నిర్వహణ కోసం విద్యార్థుల నుండి డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు. గ్రంథాలయాల్లో తగిన పుస్తకాలు లేకపోవడం, జర్నల్స్‌ ఉండకపోవడం, రీసెర్చ్‌ కార్యకలాపాల పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోధనా సిబ్బందిపై అనవసరపు పనిభారం మోపడం, సెలవులేదు అన్నట్టు పని చేయించడం, తగిన వేతనాలు ఇవ్వకపోవడం, పన్నుల పేరిట కోతలు విధించడం, వారిని అనుమానిస్తూ బానిసల్లా యాజమాన్యం చూస్తోంది. ప్రభుత్వ విధుల్లో సిబ్బందిని ఉపయోగించుకుని వారికి అందాల్సిన భత్యాలు ఇవ్వకుండా యాజమాన్యాలు స్వాహా చేస్తున్నాయి. ప్రాజెక్టు పనుల్లోనూ విద్యార్థులపై అదనపు భారాలు మోపి, తక్కువ స్థాయి కంపెనీలతో అనుసంధానం చేయడం వంటి చర్యలూ తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఉన్నత విద్యామండలి పరిధిలోని అన్ని ప్రైవేట్‌ కళాశాలలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని, ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యతను పరిరక్షించాలంటే మోసాలకు తావు లేకుండా చూడాలి. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల వ్యవహారాలపై గట్టి నియంత్రణ ఉండకపోతే, రాష్ట్రంలో విద్యావ్యవస్థే సంక్షోభంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్లతో కార్యకలాపాలు
` ఏపీటీపీఐఈఏ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బ్రహ్మానందరెడ్డి
జేఎన్టీయూ కాకినాడ, అనంతపురం పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో పనిచేసే పిహెచ్‌డీ అధ్యాపకులు ఎంతోమంది నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ టెక్నికల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీటీపీఐఈఏ) ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎంవీ బ్రహ్మానందెడ్డి తెలిపారు. అనేక సార్లు విశ్వవిద్యాలయ పాలకవర్గానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వినతులు, లేఖల ద్వారా వివరించినప్పటికీ..వారంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఓ అధ్యాపకుడిని పీహెచ్‌డీ సూపర్‌వైజర్‌గా నియమించారని, దీనిపై విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. గుంటూరు యూనివర్సల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గుంటూరు పరిధిలోని కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న కోటిరెడ్డి నూటికి నూరు శాతం అనర్హుడని, నకిలీ దూపత్రాలతో ప్రిన్సిపాల్‌గా చలామణి అవుతున్నారని తెలిపారు. మంత్రి లోకేశ్‌ స్పందించి… ఉన్నత విద్యా వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ..అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు