. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి మరింత చేయూత
. అంతర్జాతీయ సమాజానికి జెలెన్‌స్కీ పిలుపు
. 10 బిలియన్ యూరోల సాయం ప్రకటించిన ఇటలీ
కీవ్/రోమ్: ఉక్రెయిన్`రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. శాంతి చర్చలు జరుపుతామంటూనే పరస్పరం దాడులకు రెండు దేశాలు పాల్పడుతున్నాయి. ఇదే క్రమంలో రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. యుద్ధం ముగిసిన తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి మరింతగా చేయూత అందించాలని ప్రపంచ దేశాధినేతలను కోరారు. ఇటలీ రాజధాని రోమ్‌లో నిర్వహించిన ఉక్రెయిన్ రికవరీ సదస్సులో జెలెన్‌స్కీ ఈ మేరకు పిలుపునిచ్చారు. రష్యా దాడులను ఎదుర్కొనేందుకు, దీటుగా బదులిచ్చేందుకు గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉక్రెయిన్‌కు ఉందని ఆయనన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు, మౌలిక వసతులు పునర్నిర్మించుకోవడం కోసం మార్షల్ ప్లాన్ ఆధారిత సమగ్ర పునర్నిర్మాణ ప్రాథమిక నమూనా కావాలన్నారు. తాము కోలుకోవడం కోసం, దేశ పునర్నిర్మాణం కోసం మహా కూటమి ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచ దేశాల నాయకులు, వ్యాపారవేత్తల చేయూతను కోరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు 10 బిలియన్ యూరోల సాయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై పెట్టుబడి పెట్టడం అంటే తమపై పెట్టుబడి పెట్టుకున్నట్టే అని ఆమె అన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు స్వతంత్ర, సుసంపన్న ఉక్రెయిన్ సాధించాలనే ఉమ్మడి లక్ష్యసాధన కోసం తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారని మెలోని తెలిపారు. సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తో పాటు జర్మనీ, పోలాండ్, గ్రీస్, అల్బేనియా అధినేతలు, అమెరికాకు ప్రత్యేక దౌత్యాధికారి తదితరులు పాల్గొన్నారు.


