పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
‘పాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి’పై మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తాం: మంత్రి ఉత్తమ్
విశాలాంధ్ర-సత్తుపల్లి: రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి రైతాంగానికి శాశ్వత సాగునీటి వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్, దేవాదుల ఎత్తిపోతల పథకాలను తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ టన్నెల్ పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్‌తో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం నిర్వహిం చిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి వారం రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రాజెక్టుకు సంబం ధించిన అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని పర్యావరణ, న్యాయపరమైన అనుమతులు సాధించి చట్టబద్ధంగా పనులు పూర్తి చేస్తామని, సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల గోదావరి జలాల వినియోగానికి కేంద్ర జల సంఘం తుది అనుమతి లభించడంతో పనులు మరింత వేగం పుంజుకుంటాయని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగుభూమికి గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కలెక్టర్, కల్లూరు సబ్ కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, సత్తుపల్లి, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ కమిటీలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్యమూఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


