ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆడపిల్లల క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడడమేంటని ఆగ్రహం
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, తప్పులు చేసే వారి పట్ల చండశాసనుడిగా ఉంటానని స్పష్టం చేశారు వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఇప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాడు అసెంబ్లీలో తనను బూతులు తిట్టారని చంద్రబాబు వెల్లడించారు. అది కౌరవ సభ అని, గౌరవ సభగా మారాకే మళ్లీ సీఎంగా అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆడపిల్లల వ్యక్తిత్వాల గురించి చెడుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకువస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహాత్మా జ్యోతి రావు పూలే గారి స్పూర్తితో ఈచట్టం తెస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందిన అన్నారు.
బీసీలకు ఉద్యోగాల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. జిల్లాల వారీగా బీసీ భవన్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. బీసీ వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో బీసీ విద్యార్థుల కోసం సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని, ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే అందరికీ తల్లికి వందనం అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా, రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటామని, లాభదాయకమైన వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. మే నెల నుంచి రైతులకు విడతల వారీగా రూ.20 వేలు అందజేస్తామని వివరించారు. కోర్టు సమస్యలు పరిష్కరించి త్వరలోనే చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.
పీ-4తో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. సంపద అనేది ఒకరికే పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. 10 మంది సంపన్నులు 20 మంది పేదలకు చేయూతనివ్వాలన్నదే తమ అభిమతం అని వివరించారు. ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలను గుర్తించామని, అర్హులందరికీ స్థలం ఇచ్చి ఇల్లు కట్టాకే మళ్లీ ఓట్లు అడుగుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనువుగాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని విమర్శించారు.