Homeజాతీయంలద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతి ఆమోదం

లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతి ఆమోదం

- Advertisement -

కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
రాజ్యాంగంలోని అధికరణ 240, జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం-2019లోని సెక్షన్‌ 58(2) కింద తనకు ఉన్న అధికారాలను వినియోగిస్తూ రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో లద్దాఖ్‌లో కొత్త ధర్మాసనం ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
అయితే జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీనగర్‌/జమ్ములోనే కొనసాగుతుంది. దీనికి అదనంగా లద్దాఖ్‌లో కొత్త ధర్మాసనం ఏర్పాటవుతోంది.

అనుబంధంగా 16 ధర్మాసనాలు
ప్రస్తుతం దేశంలో 25 హైకోర్టులు ఉండగా.. వాటికి అనుబంధంగా 16 ధర్మాసనాలు ఉన్నాయి. తాజాగా లద్దాఖ్‌ ధర్మాసనం కూడా ఈ జాబితాలో చేరింది. దేశంలో అత్యధికంగా బాంబే హైకోర్టుకు నాలుగు అనుబంధ ధర్మాసనాలు ఉన్నాయి. ఔరంగాబాద్‌, నాగ్‌పుర్‌, పనాజి, కొల్హాపుర్‌లలో ఈ ధర్మాసనాలు పనిచేస్తున్నాయి. గువాహటి హైకోర్టుకు అయిజ్వాల్‌, ఇటానగర్‌, కోహిమాలో మూడు అనుబంధ ధర్మాసనాలు ఉన్నాయి. దక్షిణాదిలో కర్ణాటక హైకోర్టుకు బెంగళూరులో ప్రధాన ధర్మాసనంతో పాటు ధార్వాడ్‌, కలబుర్గిలో ధర్మాసనాలు ఉన్నాయి. మద్రాస్‌ హైకోర్టుకు చెన్నైలో ప్రధాన ధర్మాసనంతో పాటు మదురైలో ధర్మాసనం కొనసాగుతోంది.

కర్నూలులో.. సుదీర్ఘ నిరీక్షణ
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోనూ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. పాలనా సౌలభ్యం, ప్రాంతీయ సమతౌల్యం దృష్ట్యా కర్నూలులో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం 2024 నవంబరు 21న అసెంబ్లీలో తీర్మానం చేసింది. అనంతరం ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీ పర్యటనల సందర్భంగా కర్నూలులో హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. త్వరలోనే ధర్మాసనం ఏర్పాటవుతుందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా వివిధ సందర్భాల్లో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు