Homeతెలంగాణపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా 'ఇందిరమ్మ టవర్స్‌'.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ‘ఇందిరమ్మ టవర్స్‌’.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

- Advertisement -

క్యూర్‌ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ టవర్స్‌’ పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.పేదలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేయిస్తుందని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాజకీయాలు, కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.అత్యంత పారదర్శకంగా దరఖాస్తుదారులు, మీడియా సమక్షంలోనే డ్రా తీస్తున్నామని, ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలందరూ వీక్షించేలా చేస్తున్నామని వివరించారు.నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో శుక్రవారం ‘ఇందిరమ్మ ఇండ్ల’ లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించారు.
నాంపల్లిలోని రెడ్‌హిల్స్‌, రాజేంద్రనగర్‌లోని లక్ష్మీగూడలో జరిగిన కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు.

లాంఛనంగా ఎంపిక ప్రక్రియ
తొలుత రెడ్‌హిల్స్‌లో ఓ మహిళతో డ్రా తీయించి, చీటీలో వచ్చిన లబ్ధిదారు పేరును వేదికపై ప్రకటించడంతో ఎంపిక ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.మొత్తంగా కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, నాంపల్లి నియోజకవర్గాల్లో 600 మందిని, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 140 మంది లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్ల కోసం 600 మందిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.ఇందులో 120 మంది వెయిటింగ్‌ లిస్టులో ఉంటారని వివరించారు. లక్కీడ్రా అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారని మంత్రి తెలిపారు.

పది అంతస్తుల్లో.. అన్ని సదుపాయాలతో..
ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే వారిని తొలగించి, ఆ స్థానంలో వెయిటింగ్‌ లిస్టులో ఉన్నవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.’ఇందిరమ్మ టవర్స్‌’ను పది అంతస్తుల్లో నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. లిఫ్టుతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు.ఒక్కో ఫ్లాట్‌కు గరిష్ఠంగా 20 గజాల అన్‌డివైడెడ్‌ వాటా భూమి వస్తుందని తెలిపారు. ఫ్లాట్లు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వ ఖర్చుతోనే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.రిజిస్ట్రేషన్‌ పూర్తయిన పదేళ్ల తర్వాత ఫ్లాట్‌ను విక్రయించుకునే హక్కు ఉంటుందని చెప్పారు.అయితే అంతకంటే ముందే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చని వివరించారు.

ఇళ్లు రాలేదని ఎవరూ నిరాశ చెందవద్దు
లబ్ధిదారుల తుది ఎంపిక పూర్తయిన తర్వాత ఇంటికి సంబంధించిన ధ్రువపత్రాలను అందజేస్తామని మంత్రి తెలిపారు.ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లోనే టవర్స్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. లబ్ధిదారులు కూడా స్వయంగా నిర్మాణ పనులను పర్యవేక్షించుకోవచ్చని వెల్లడించారు.అర్హత ఉన్నప్పటికీ ఈ విడతలో ఇల్లు రాలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, ప్రతి పేద కుటుంబం సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

‘లక్కీ’ లక్ష్మి.. కుమారుడు తీసిన చీటీలో తల్లి పేరు
రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవులపల్లిలోని లక్ష్మీగూడలో లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన మంత్రి పొంగులేటి.. అక్కడున్న ఓ మహిళతో తొలి చీటి తీయించాలని భావించారు. కుమారుడితో కలిసి వచ్చిన శంషాబాద్‌కు చెందిన లక్ష్మిని వేదికపైకి పిలిచారు.పెట్టెలో ఉన్న చీటీల్లో ఒకదాన్ని తీయాలని లక్ష్మి కుమారుడు పృధ్వీశ్‌కు మంత్రి సూచించారు.దీంతో బాలుడు ఓ చీటిని బయటకు తీసి పక్కనే ఉన్న హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌కు అందించాడు.ఆ చీటీలో ‘లక్ష్మి’ పేరు ఉండటంతో గౌతమ్‌ ఆ పేరును ప్రకటించారు. అక్కడే ఉన్న లక్ష్మి.. చీటీలో ఉన్నది తన పేరేనని ఆనందంతో ‘అది నేనే’ అని చెప్పడంతో వేదికపై నవ్వులు పూశాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు