కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులను నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదికను సమర్పించారు.మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈనెల 9న విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. దీనిపై అదే రోజు కమిటీని నియమించి విచారణ చేపట్టారు. నిన్న (గురువారం) రాత్రి వరకు విద్యార్థినులతో విచారణ కమిటీ మాట్లాడి నివేదిక సిద్దం చేశారు. చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని అధికారులు నిర్ణయించారు.
కాగా.. రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులను ల్యాబ్ అటెండెంట్ లైంగిక వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా విధుల్లో నిమగ్నమై ఉండగా అసభ్యకరమైన ఫొటోలు తీసి వాట్సాప్‌లకు పంపించేవాడని, రూమ్‌కు రమ్మని బెదిరించేవాడని, డబ్బులు ఎరవేసేవాడని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఈనెల 9న విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరుగగా.. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.


