హత్యకు నెల రోజుల ముందే రిహార్సల్స్ చేసినట్టు పోలీసుల గుర్తింపు
నిందితులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసుల ప్రయత్నం
కీలకమైన డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు వెల్లడి
మహారాష్ట్రలోని పూణె జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, రియల్టర్ కేతన్ అగర్వాల్ (25) హత్య కేసులో నిందితులకు వడ్గావ్ మావల్ కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి కేతన్‌ను తోసి హత్య చేసినట్టు అతడితో నిశ్చితార్థం చేసుకున్న సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచగా, న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణలో పోలీసులు షాకింగ్ విషయాలను వెలికితీశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మే నెలలోనే పూణెలోని లూల్లానగర్ సమీపంలో ఉన్న ఒక క్లబ్ వద్ద కేతన్‌ను కొండపై నుండి ఎలా తోసేయాలో వీరిద్దరూ కలిసి రిహార్సల్ చేసినట్లు తేలింది. జులై 2న నిందితురాలు సియాను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. అలాగే హత్య జరిగిన రోజున సియా ధరించిన దుస్తులను కూడా పోలీసులు ఆమె నివాసం నుండి స్వాధీనం చేసుకున్నారు.
ఈ దారుణ హత్యకు సంబంధించి నిందితుల మొబైల్ డేటా, లొకేషన్ వివరాలు సహా బలమైన సాంకేతిక, డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరించారు. అయితే కేసులోని మరిన్ని రహస్యాలను రాబట్టడానికి నిందితులు ఇద్దరికీ పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించడానికి అనుమతించాల్సిందిగా పోలీసులు కోర్టును అభ్యర్థించారు. దీనిపై కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసి, వారి సమ్మతిని రికార్డ్ చేసిన తర్వాత తదుపరి నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది.


