న్యూదిల్లీ: వాట్సప్‌లోని యూజర్‌నేమ్ ఫీచర్ విషయంలో మెటాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, నకిలీ గుర్తింపులతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. అప్పటివరకు భారత పౌరులకు యూజర్‌నేమ్ ఫీచర్ రోల్అవుట్ను ఆపాలని సూచించింది. ఈ వ్యవహారంలో సంప్రదింపులు పూర్తయ్యాకనే ఈ అంశంపై ముందుకెళ్లాలని నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పు దృష్ట్యా కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వివాదాస్పద ప్రకటనలపై వివరణ ఇవ్వాలని మెటా ను కేంద్ర ఐటీ శాఖ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకే వారంలో మెటాకు వరుసగా రెండుసార్లు కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కాగా, చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రకటనల విషయంలో మెటా కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. .


