Homeజాతీయంభారత సైన్యంలో కీలక మార్పులు.. సీడీఎస్, నేవీ చీఫ్‌ల నియామకం

భారత సైన్యంలో కీలక మార్పులు.. సీడీఎస్, నేవీ చీఫ్‌ల నియామకం

- Advertisement -

భారత రక్షణ దళాల్లో రెండు అత్యంత కీలకమైన నియామకాలు జరిగాయి. దేశ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌)‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, నౌకాదళానికి నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మే 30న పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో సుబ్రమణి బాధ్యతలు చేపడతారు. ఈయన సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తారు. ఇక, నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ దినేశ్‌ కుమార్ త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేయనుండటంతో కృష్ణ స్వామినాథన్ ఆ పదవిని అలంకరించనున్నారు.

లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నేపథ్యం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పూర్వ విద్యార్థి అయిన సుబ్రమణి, 1985లో గర్హ్వాల్ రైఫిల్స్‌లో సైన్యంలోకి ప్రవేశించారు. 35 ఏళ్లకు పైబడిన తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆర్మీ వైస్ చీఫ్‌గా, సెంట్రల్ కమాండ్ చీఫ్‌గా, మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ, మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తిచేశారు. కజకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అటాషెగా కూడా సేవలందించారు. సైన్యానికి చేసిన విశిష్ట సేవలకు గానూ పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేనా మెడల్, విశిష్ట సేవా పతకం వంటి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.

వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నేపథ్యం
నౌకాదళ నూతన అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 1987లో నేవీలో చేరారు. ఈయన కూడా ఎన్డీఏ పూర్వ విద్యార్థే. తన కెరీర్‌లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే విమాన వాహక నౌకతో పాటు పలు క్షిపణి నౌకలకు కమాండర్‌గా వ్యవహరించారు. వెస్ట్రన్ ఫ్లీట్ కమాండర్‌గా, నేవీ వైస్ చీఫ్‌గా, సదరన్ నేవల్ కమాండ్‌లో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నేవీలో శిక్షణ ప్రమాణాలను మెరుగుపరచడంలో, ఆపరేషనల్ సేఫ్టీని పర్యవేక్షించే ఇండియన్ నేవల్ సేఫ్టీ టీమ్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గానూ అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు. ఈ రెండు ఉన్నత నియామకాలతో దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని నిపుణులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు