Homeఅంతర్జాతీయంమరోసారి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు!

మరోసారి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు!

- Advertisement -

వాషింగ్టన్: పశ్చిమాసియాలో సంఘర్షణల ముగింపునకు ముందడుగు పడింది. అమెరికా-ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు ఇరుదేశాల ప్రతినిధులు వచ్చేవారం రానున్నట్లు మీడియాలో కథనాలు వెళువడుతున్నాయి. ఘర్షణకు ముగింపు పలకడమే లక్ష్యంగా…14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశం ఉందని ఆ కథనాలు వెల్లడించాయి. ఇందులో ఇరాన్ అణు కార్యక్రమం, దానివద్ద ఉన్న యురేనియం నిల్వల బదిలీ, హోర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించడం వంటి కీలక విషయాలు ఉన్నాయి. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తెహ్రాన్ ఆది నుంచీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ చర్చలకు ఇవే అడ్డంకిగా మారాయి. ఈ చర్చలు సానుకూలంగా సాగితే ఇరుదేశాల మధ్య కొనసాగుతోన్న కాల్పుల విరమణ ఒప్పందం మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక, పశ్చిమాసియా సంఘర్షణ ముగించేందుకు తాము పంపిన ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి నేడు స్పందన వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. హోర్మూజ్‌లో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ’ను తిరిగి పునరుద్ధరించే విషయాన్ని తమ యంత్రాంగం పరిశీలిస్తుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ త్వరగా ఒప్పందంపై సంతకం చేయకపోతే… ఈ కార్యక్రమాన్ని ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస’గా నిర్వహిస్తామన్నారు.
హోర్మూజ్‌లో సైనిక కార్యకలాపాలు సహించేది లేదు: ఇరాన్ హెచ్చరిక
అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. పర్షియన్ గల్ఫ్, హోర్మూజ్‌లో యూఎస్ తన సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తే…విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేసింది. ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్‌కు యూఎన్‌లోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ ఓ లేఖ రాశారు. ఇందులో హోర్మూజ్ జలసంధిలో సైనిక చర్యలకు దిగి యూఎస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు