కొత్త అవతారంలో హిట్ మ్యాన్
ముంబై: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. మైదానంలో భారీ షాట్లతో విరుచుకుపడే హిట్‌మ్యాన్ రోహిత్ బుల్లి తెరపై కన్పించనున్నాడు. ఓ టెలివిజన్ షోతో బుల్లితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి టీజర్‌ను విడుదల చేయడంతో ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోనీ పిక్చర్ ఈ టీజర్‌ను విడుదల చేసింది. ‘గార్డెన్లో ఎవరూ తిరగకూడదు’ అనే రోహిత్ పాపులర్ డైలాగ్‌తో దీన్ని రూపొందించడం మరింత ఆకట్టుకుంది. వీడియోలో రోహిత్ ఓ చోట కూర్చుని ఉండగా అభిమానులు అతడి ఆటోగ్రాఫ్ కోసం వస్తారు. వచ్చిన వారంతా ‘గార్డెన’ డైలాగ్ చెప్పండంటూ హిట్‌మ్యాన్‌ను కోరడంతో అతడు ఒకింత అసహనానికి గురవుతాడు. చివర్లో రోహిత్ బయటకు వస్తూ…‘నేను చెప్పిన రెండు లైన్లే ఇంత వైరల్‌గా మారాయంటే…నా మొత్తం షో రిలీజ్ అయితే ఏమవుతుందో ఊహించండి’ అంటూ చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
‘అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ డెబ్యూకు మీరు సిద్ధమా’ అంటూ సోనీ టీవీ ఈ టీజర్‌ను పంచుకుంది. దీన్ని రోహిత్ శర్మ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ…‘గార్డెన్ పని చాలు, ఇప్ప్పుడు కొత్తగా ఏదైనా చేద్దాం’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అలజడి చేస్తోంది. రోహిత్ కామెడీ టైమింగ్ చూసి అభిమానులు ‘బ్లాక్‌బస్టర్…వెయిటింగ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది టాక్ షోనా, కామెడీ షోనా, రియాల్టీ గేమ్ షోనా అన్న వివరాలు తెలియదు. 2024లో ఓ టెస్ట్ సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ… తన సహచర జట్టు సభ్యులపై ఒకింత అసహనానికి గురైన సంగతి తెలిసిందే. మైదానంలో ఆటగాళ్లు నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతుంటే… ‘మనం గార్డెన్లో తిరగడానికి రాలేదు’ అంటూ రోహిత్ వారిని మందలించాడు. ఆ తర్వాత నుంచి రోహిత్ ‘గార్డెన’ డైలాగ్ తెగ పాపులరైంది. ఇప్ప్పుడు ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్నాడు రోహిత్.


