విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రజల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న కళాజాత కార్యక్రమాలను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నివారణ, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స పొందడం, అలాగే హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్షను నివారించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 26 ప్రాంతాల్లో రెండు కళాజాత బృందాలు వీధి నాటకాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన అవగాహన కల్పిస్తాయన్నారు . ఈ కార్యక్రమాలు జిల్లాలోని సుమారు 20 మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఎయిడ్స్, టీబీ మరియు కుష్ఠు వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన వైద్య సేవలను వినియోగించుకోవడం, అలాగే వ్యాధి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్వైజర్ జి.వి. రమణ, డా. శివ రెడ్డి, నాగన్న, దిశ నారాయణ స్వామి , లింక్ వర్కర్స్ ప్రోగ్రాం డి.ఆర్.పీ. రమేష్ యాదవ్, టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం సిబ్బంది, లింక్ వర్కర్స్ ప్రోగ్రాం సిబ్బంది మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


