ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ(మంగళవారం), రేపు (బుధవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు.బుధవారం కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇవాళ మన్యం అల్లూరి జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
తెలంగాణలో...
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ(మంగళవారం), రేపు (బుధవారం) అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించారు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం)13 జిల్లాలు, రేపు(బుధవారం) 12 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న(సోమవారం) హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


