తెలంగాణలో వర్షాలు మళ్లీ పుంజుకున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. రాజధాని సహా ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్, మరో 14 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్్ణ జారీ చేసింది.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉండటంతో యంత్రాంగం అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.


