Homeజిల్లాలుఅనంతపురండీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలతో అప్రమత్తమైన వైద్య వ్యవస్థ….

డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలతో అప్రమత్తమైన వైద్య వ్యవస్థ….

- Advertisement -

సమాచారం లీక్‌తో మూతపడిన ఆర్ఎంపీ క్లినిక్‌లు, మెడికల్ స్టోర్లు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్ల) : మండలంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) కట్ట వెంకటేశ్వర్లు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి..నార్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆయన ఆకస్మికంగా సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స విధానం, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు రోగుల పట్ల సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.అనంతరం మండల కేంద్రంలో శ్రీ లలితా క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. క్లినిక్ నిర్వహణ, అనుమతులు, రికార్డులను పరిశీలించిన అనంతరం క్లినిక్ వైద్యుడు రామచంద్రకు నోటీసులు జారీ చేశారు. వైద్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు.ఇదిలా ఉండగా డీఎంహెచ్‌ఓ నార్పలకు వస్తున్నారనే సమాచారం ముందుగానే బయటకు వెళ్లినట్లు మండలంలో జోరుగా చర్చ సాగుతోంది. తనిఖీల సమాచారం అందగానే మండల వ్యాప్తంగా పలువురు ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్‌లను మూసివేయగా, అనేక మెడికల్ స్టోర్లు కూడా షట్టర్లు దించాయి. సాధారణంగా రద్దీగా ఉండే కొన్ని క్లినిక్‌లు, మెడికల్ షాపులు తనిఖీల సమయంలో పూర్తిగా మూతపడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.ఆకస్మిక తనిఖీల ఉద్దేశం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడమే అయినప్పటికీ, సమాచారం ముందుగానే లీక్ కావడంతో తనిఖీల ప్రభావం కొంత మేర తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌లు, అక్రమ వైద్య సేవలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మెడికల్ దుకాణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు