Saturday, March 14, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్‌ రాజ్యాంగం… : వైఎస్‌ జగన్‌

ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్‌ రాజ్యాంగం… : వైఎస్‌ జగన్‌

- Advertisement -

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని ప్రశ్నించారు. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్‌ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. తమ పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సూపర్‌సిక్స్‌ అంటూ ప్రజలను మోసం చేశారు.. నాడు నేడు ఆగిపోయింది.. ఇంగ్లీషుమీడియం ఆగిపోయింది.. అన్ని పథకాలు ఆపేశారు.. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్‌ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన ఇంటి పైకి 80 మందిని పంపి దాడిచేయించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి..మనుషుల్ని చంపాలని చూడటమేంటి..అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు విష బీజాలు నాటారని అన్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు. లిక్కర్‌ మాఫియాకు డాన్‌ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్ల్లీగల్‌ పర్మిట్‌ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలలోపే మా ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం..తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు అని జగన్‌ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు