విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండల తహసీల్దార్ కార్యాలయంలో నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “పరిశ్రమలు – ఉపాధి కల్పన” కార్యక్రమానికి విచ్చేసిన విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిను విజయనగరం పార్లమెంటరీ జిల్లా సీనియర్ నాయకులు మిత్తిరెడ్డి మధుసూదనరావు మర్యాదపూర్వకంగా కలసి సన్మానించారు.ఈ సందర్భంగా మిత్తిరెడ్డి మధు మాట్లాడుతూ – రాజాం పట్టణంలోని 24 వార్డుల్లోని సన్న, చిన్న, కౌలు రైతులు భూములను అమ్ముకునేందుకు ప్రయత్నించినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో (1బి) వారి భూములు ఇతరుల పేర్లపై చూపబడడం వల్ల పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని వివరించారు. పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత విద్య, వైద్యం వంటి అవసరాలకు భూమిని అమ్ముకోవాలన్నా, కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని చెప్పారు.ఈ సమస్యల నుంచి రైతులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాజాం మున్సిపాలిటీ పరిధిలో భూ రీ–సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.


