సివిల్ సప్లై శాఖ కేవలం తమ కుటుంబంపై మాత్రమే క్రిమినల్ కేసులు పెట్టిందన్న పేర్ని నాని
కేసులకు భయపడేది లేదని వ్యాఖ్య
ఎప్పటికీ జగన్ వెంటే ఉంటామన్న పేర్ని నాని
గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేశారనే అభియోగాలతో వైసీపీ నేత పేర్ని నాని, ఆయన భార్య పేర్ని జయసుధలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానికి హెకోర్టు బెయిల్ మంజూరు చేయగా… ఆయన భార్యకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ మరెవరిపై క్రిమినల్ కేసులు పెట్టలేదని పేర్ని నాని అన్నారు. సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదని… సీజ్ ది షిప్, సీజ్ ది గోడౌన్ అన్నాకూడా… ఎవరిపై క్రిమినల్ కేసులు పెట్టలేదని చెప్పారు. వాళ్లందరిపై కేవలం 6ఏ కేసు మాత్రమే పెట్టారని తెలిపారు.
తనకు ముందు కానీ… తన తర్వాత కానీ ఒక్కరిపై కూడా క్రిమినల్ కేసు పెట్టలేదని చెప్పారు. తనపై కక్ష కట్టారనే విషయం దీంతో అర్థమవుతుందని అన్నారు. తనను, తన భార్యను, తన కొడుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని చెప్పారు. అవసరమైతే జైలుకు వెళదామని తన భార్య కూడా చెబుతోందని అన్నారు. కేసులకు భయపడేది లేదని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ నుంచి తప్పుకునేది లేదని… ఎప్పటికీ జగన్ వెంటే ఉంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.