‘ఒక ఈటె…ఒక లక్ష్యం…ఒక దైవిక తీర్పు’ శీర్షికతో పోస్టర్
సినిమా: అగ్ర హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘కార్తికేయ’ సినిమాపై క్లారిటీ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయుడి సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఆయన ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. పురాణాల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఎన్నాళ్ల నుంచో ఉత్సుకతని రేకెత్తించిన ఈ సినిమాని ఎట్టకేలకి చిత్రబృందం సోమవారం ప్రకటించింది. కార్తికేయుడి పురాణగాథగా, భారీ హంగులతో కూడిన చిత్రమిది. ‘ఒక ఈటె…ఒక లక్ష్యం…ఒక దైవిక తీర్పు’ అనే శీర్షికతో కూడిన ప్రత్యేకమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించాయి సినీ వర్గాలు. పోస్టర్‌తోనే ఈ సినిమా స్థాయిని చాటి చెప్పాయి. లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠ భరితమైన యుద్ధ సన్నివేశాలు, సరికొత్త కథాప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి, మరోసారి త్రివిక్రమ్ కలం బలం తోడవడం, దైవిక అంశాలతో కూడిన కథాంశం కారణంగా ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకు దీటుగా సినిమా రూపొందుతుంది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రం కోసం పనిచేస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వస్తున్నట్లు టాక్.
త్వరలో సెట్స్ పైకి ఎన్టీఆర్ ‘కార్తికేయ’
- Advertisement -
RELATED ARTICLES


