సూరత్‌లో ఘటన..
మహిళా చట్టాలను అడ్డుపెట్టుకుని భార్య వేధిస్తోందని ఆరోపణ
సూరత్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కిరిట్ పటేల్
గతంలోనూ ఆమెకు వివాహమైందని, వారిని కూడా వేధించిందని ఆరోపణ
గుజరాత్‌లోని సూరత్‌లో ఒక వింత ఘటన వెలుగుచూసింది. తన భార్య వేధింపులు తాళలేకపోతున్నానని, తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కిరిట్ పటేల్ అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది. భార్యతో న్యాయపరమైన వివాదాలు, మానసిక వేదనతో విసిగిపోయానని, తనకు మరణమే శరణ్యమని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నాడు. తన భార్య ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తోందని, మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తోందని కిరిట్ పటేల్ ఆరోపించాడు. తనకు, తన భార్యకు ఇది మూడో వివాహమని ఆయన తెలిపారు. తన భార్యను ఃదోపిడీ చేసే పెళ్లికూతురుఃగా అభివర్ణించాడు. ఆమె డబ్బు కోసం చట్టపరమైన కేసులతో పెళ్లి చేసుకుని వేధిస్తుందని ఆరోపించాడు.
ఇంతకుముందు పెళ్లి చేసుకుని వదిలేసిన వారిని కూడా ఇలాగే వేధించిందని పేర్కొన్నాడు. వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు చెప్పాడు. ఆమె వేధింపులపై వారు పోలీసులను ఆశ్రయించారని చెప్పాడు. తనకు 2024తో ఆమెతో వివాహం జరిగిందని, నాటి నుంచి తన భార్య, అత్త డబ్బు కోసం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. తన సమస్యను నిర్దిష్ట గడువులోగా తీర్చాలని కలెక్టర్‌ను కోరారు. గృహ హింస ఎదుర్కొంటున్న పురుషులకు చట్టపరమైన రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశాడు. కారుణ్య మరణ అభ్యర్థనలపై జిల్లా అధికారులు స్పందించవలసి ఉంది.


