– ఆదేశాలు జారీచేసిన కేంద్ర జలశక్తి శాఖ
అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి బి.ఎల్ మీనా పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. చీఫ్ ఇంజినీరు, డిజైన్ల విభాగంతో సహా అందరినీ తరలించాలని అందులో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరం తరలింపునకు ఆదేశాలు వెలువడ్డాయి. అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరంలో ఉండటం వల్ల ఈ కార్యకలాపాల్లో సమన్వయం సులభమవుతుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారని సమాచారం. దీంతో అప్పటిలోగా తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో పోలవరం అథారిటీ కోసం అద్దె భవనం తీసుకున్నారు. రూ.3 లక్షల అద్దె కూడా చెల్లిస్తున్నారు. పోలవరం అథారిటీ చీఫ్ ఇంజినీరు రమేష్‌కుమార్ రాజమహేంద్రవరం నుంచే పనిచేస్తున్నారు. తాజా ఆదేశాలతో మిగిలిన అన్ని విభాగాలు కూడా ఇక్కడికి రానున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి రాజమహేంద్రవరం చాలా దగ్గర. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. పైగా పోలవరం ప్రాజెక్టు రెండో దశకు డీపీఆర్ రూపకల్పన చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును రెండు దశలుగా విడగొట్టారు. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా అవసరమైన నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ మేరకు వెచ్చించిన నిధులకు తగిన విధంగా ఆయకట్టు కల్పించి వాటి ద్వారా వ్యయం, ఫలితాలు సంతృప్తి చెందిన తర్వాత రెండో దశలో 45.72 మీటర్లకు నీళ్లు నిలబెట్టేలా పునరావాసానికి నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ రెండో దశ డీపీఆర్ సిద్ధం చేయడం కీలక అంశం. రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు, పోలవరం అథారిటీ సమన్వయంతో వీటికి రూపకల్పన చేయాల్సి ఉంది. దీంతోపాటు కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల నిర్మాణమూ ముఖ్యమే. వాటి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది.


