ముగ్గురు నిందితుల అరెస్ట్.…
విశాలాంధ్ర–అమడగూరు:అమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కర్ణాటక వాసి ముత్తప్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి వివాదాలు, అవమానంతోనే హత్యకు కారణమని దర్యాప్తులో తేలిందనట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యేక పోలీస్ బృందాల ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, భూమి వివాదాలతో పాటు తన అన్న కూతురుతో చెప్పుతో కొట్టించాడన్న అవమానాన్ని భరించలేక నిందితులు పగతో ముత్తప్పను హత్య చేసినట్లు విచారణలో తేలింది. సెప్టెంబర్ నెల మూడవ తేది రాత్రి ఆకులవారిపల్లి శివారులో ఇనుప రాడ్లతో దాడి చేసి ముత్తప్పను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన నిందితులను మహమ్మదాబాద్ గ్రామంలో ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టబోమని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో డీఎస్పీ విజయ్ కుమార్, సీఐలు నరేంద్ర రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


