గిరిజన హక్కుల్ని కాలరాయడానికే ‘వనవాసి’ పదం
‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన’లో రాహుల్ గాంధీ
వడోదరా: దేశంలో కుల గణన జరిగితే…గిరిజనులకు అధికారం, సంపదలో భాగస్వామ్యం లభిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్‌లోని వడోదరాలో సోమవారం జరిగిన ‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన’లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. వేదికపై గిరిజనుల సాంప్రదాయ విల్లంబులను ఎక్కు పెట్టారు. బీజేపీ, ఆరఎసఎస్‌లు గిరిజనులను ‘వనవాసి’ అని పిలవడాన్ని రాహుల్ ఖండించారు. అనిదిగా…జలాలు, అడవులు, భూమిపై తొలి యాజమాన్యం గిరిజనులదేనని, ఆ హక్కును వారికి లేకుండా చేయడం కోసం బీజేపీ, ఆరఎసఎస్‌లు వారిని కేవలం అడవుల్లో నివసించే వనవాసులుగా అభివర్ణిస్తున్నాయని మండిపడ్డారు. ‘21వ శతాబ్దంలో ఆరెస్సెస్-బీజేపీలు సృష్టించిన ఒక కొత్త పదం ప్రాచుర్యం పొందుతోందని విమర్శించారు. అదే వనవాసి(అడవిలో నివసించేవారు). వనవాసి అంటే గిరిజనులు కేవలం అడవుల్లో నివసిస్తున్నారే తప్ప ఆదిమ కాలం నుంచీ అడవులకు యజమానులు కాదని అర్థం. ఆదివాసి అంటే అడవులు, భూములు, జలాలపై తొలి యాజమాన్య హక్కులు కలిగినవారని. ఈ రెండు మాటలకూ చాలా తేడా ఉంది’ అని రాహుల్ తెలిపారు. మరోవైపు…భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ… భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా సంస్థలకు బార్లా ద్వారాలు తెరిచారని దుయ్యబట్టారు. దీనితో మన రైతాంగం పోటీ పడలేదన్నారు. దేశీయ పంటలు దెబ్బ తిని, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు.


