విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వేసిన పంటలను జింకల బెడద నుంచి రక్షించాలని వైసిపి ఎస్సీ సెల్ స్టేట్ జనరల్ సెక్రెటరీ గుడిసె మహానంది, వైస్ ఎంపీపీ లింగమ్మ తనయుడు ప్రకాష్, జిల్లా యూత్ విభాగ కార్యదర్శి మసాలా ప్రకాష్ లు డిమాండ్ చేశారు. సోమవారం జింకలు ధ్వంసం చేసిన రైతు వీరేష్ పంట పొలాలను వైఎస్ఆర్సిపి నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలను జింకలు మొలక దశలోనే తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, సజ్జ, కంది, కొర్ర, టమోటా, మిరప, చోళేకాయ పంటలపై గుంపులు గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంట పొలాలు జింకల బారిన పడి ధ్వంసం కావడంతో రైతులు అప్పుల్లో కోరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2008 చట్టం ప్రకారం జింకల బారి నుంచి నష్టపోయిన పంటలకు ఇస్సూరెన్ప్ వర్తింపజేయాలని, జింకల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టర్ కు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వమే విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డే వెంకటేష్, కురువ శివ, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


