కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో పులివెందులలో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కోసం పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ నేతలను ముందుగా లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో వివాదం మొదలైంది. పోలీసుల నిర్ణయంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో గుంపును చెదరగొట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న తీవ్రమైన రాజకీయ పోటీయే ఈ ఉద్రిక్తతలకు కారణమని తెలుస్తోంది.
ఘటన అనంతరం పులివెందులలో భారీగా పోలీసులను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు.


